చిరంజీవి సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర?

02-01-2021 Sat 21:12
  • టాలెంటెడ్ నటుడిగా సత్యదేవ్ కి పేరు 
  • 'ఆచార్య' తర్వాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్
  • కీలక పాత్రకు సత్యదేవ్ ఎంపిక
  • ఇటీవల చిరంజీవితో ఫొటో దిగిన వైనం
Satyadev in Chiranjeevis movie

గత పదేళ్ల నుంచీ తెలుగు సినిమాలలో రకరకాల పాత్రలు పోషిస్తున్నప్పటికీ, యువ నటుడు సత్యదేవ్ కి ఇటీవలి కాలంలోనే బాగా పేరొచ్చింది. 'బ్లఫ్ మాస్టర్', 'బ్రోచేవారెవరురా', 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' వంటి సినిమాల ద్వారా టాలెంటెడ్ నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'గుర్తుందా శీతాకాలం', 'తిమ్మరుసు'  చిత్రాలలో హీరోగా నటిస్తూ బిజీగా వున్న ఈ నటుడికి తాజాగా ఓ లక్కీ ఛాన్స్ వచ్చింది. అదే.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం!

'ఆచార్య' సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో చేయనున్నారు. మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రకు గాను తాజాగా సత్యదేవ్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అదే కనుక వాస్తవమైతే, చిరంజీవి తర్వాత ఈ సినిమాలో సత్యదేవ్ నటించేదే ముఖ్య పాత్ర అవుతుందని అంటున్నారు. ఈ సినిమా విషయంలోనే రెండు రోజుల క్రితం చిరంజీవిని సత్యదేవ్ కలిసినట్టు తెలుస్తోంది. ఆ సందర్భంగా దిగిన ఫొటోను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.