Red Ant Chutney: కరోనాకు 'ఎర్రచీమల పచ్చడి' చికిత్సపై ఏదో ఒకటి తేల్చండి: ‘ఆయుష్’కు ఒడిశా హైకోర్టు ఆదేశం
- ఎర్రచీమల పచ్చడి కరోనాను అడ్డుకుంటుందన్న పరిశోధకుడు
- పరిశోధన కోసం ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్
- మూడు నెలల్లో చెప్పాలంటూ హైకోర్టు ఆదేశం
బ్రిటిష్ సెలబ్రిటీ చెఫ్ గోర్డాన్ రామ్‌సే మెనూలో లోని ఎర్ర చీమల పచ్చడి మరోమారు వార్తల్లోకి ఎక్కింది. కొవిడ్-19ను ఎర్రచీమల పచ్చడి తరిమి కొడుతుందని, దీనిని ఉపయోగించుకోవాలన్న ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాలంటూ ఆయుష్ మంత్రిత్వ శాఖ, సీఎస్ఐఆర్‌లను ఒడిశా హైకోర్టు ఆదేశించింది.
కరోనా రోగుల చికిత్సలో సంప్రదాయ ఎర్ర చీమల చట్నీని ఉపయోగించే విషయంలో పరిశోధనలు జరపాలంటూ చేసిన ప్రతిపాదనను పెడచెవిన పెట్టారంటూ బారిపడకు చెందిన ఇంజినీర్, పరిశోధకుడు నయాధర్ పఢియాల్ పిల్ దాఖలు చేశారు. ఎర్రచీమల చట్నీపై పరిశోధన చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
నయాధర్ పిల్‌ను విచారించిన జస్టిస్ బీఆర్ సారంగి, జస్టిస్ ప్రమాథ్ పట్నాయక్‌లతో కూడిన బెంచ్.. కేసు అర్హతపై ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా.. ఆయుష్ మంత్రిత్వశాఖ, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరళ్లకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా చికిత్సకు ఎర్రచీమల పచ్చడి ఉపయుక్తమో, కాదో మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది.
రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ అయిన పఢియాల్ జూన్‌లో ఓ ప్రతిపాదన పంపారు. ఎర్రచీమల పచ్చడి, సూప్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కరోనాను ఇది నివారిస్తుందని అందులో పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లోని గిరిజనులు దగ్గు, శ్వాసకోశ సమస్యలు, జలుబు, ఫ్లూ.. తదితర వ్యాధుల నివారణకు దీనిని వినియోగిస్తారని తెలిపారు.