గుణశేఖర్ 'శాకుంతలం' నాయికగా సమంత.. అధికారిక ప్రకటన!

01-01-2021 Fri 21:34
  • గుణశేఖర్ దర్శకత్వంలో దృశ్య కావ్యం 'శాకుంతలం'
  • కథానాయిక పాత్ర విషయంలో రకరకాల పేర్లు ప్రచారం 
  • సమంతను ఎంపిక చేసినట్టు గుణ టీమ్ వర్క్స్ వెల్లడి  
Samantha to play lead role of Shauntalam directed by Gunashekhar

సస్పెన్స్ విడిపోయింది. అనుష్కా? పూజ హెగ్డేనా? అసలు ఎవరు? అంటూ ఇన్నాళ్లూ సాగిన సస్పెన్స్ ఈ రోజు తొలగిపోయింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందే దృశ్య కావ్యం 'శాకుంతలం'లో టైటిల్ రోల్ ను అందాలతార సమంత పోషిస్తోంది. ఈ విషయాన్ని ఈ రోజు చిత్ర నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ అధికారికంగా ప్రకటించింది.

కాళిదాసు విరచిత శాకుంతలం కావ్యాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల ప్రకటించగానే, ఇందులో శకుంతలాగా నటించే అందాలభామ విషయమై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరికి ఆ అందమైన పాత్రను పోషించే అవకాశం అక్కినేని వారి కోడలు సమంతకు దక్కింది. ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా ఈ రోజు విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తారు.

ఇటీవలి కాలంలో 'ఆహా' ఓటీటీ సంస్థకు 'సామ్ జామ్' ప్రోగ్రాం చేస్తూ సమంత బిజీగా వుంది. అలాగే, తమిళంలో నయనతారతో కలసి ఒక సినిమా చేస్తోంది. మరోపక్క, 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ లో కథానాయికగా నటిస్తోంది.