Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీ నేతలు పగలు కొట్టుకుంటారు, రాత్రి కలుసుకుంటారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy take dig at BJP and TRS leaders

  • పీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి!
  • విమర్శల్లో దూకుడు పెంచిన వైనం
  • వ్యవసాయ చట్టాలపై కేసీఆర్ ఎందుకు నోరువిప్పడంలేదని ఆగ్రహం
  • కాళేశ్వరం పేరిట దోచుకున్నారని ఆరోపణలు

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి రేసులో ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి తన విమర్శల్లో పదును పెంచారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పగలు కొట్టుకుంటారని, రాత్రి కలుసుకుంటారని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని బంద్ లో పొల్గొన్న సీఎం కేసీఆర్ ఇవాళ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిసి కూడా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట టీఆర్ఎస్ సర్కారు వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని, కేంద్రం కోరితే దీనిపై ఆధారాలను అందజేస్తామని, తమను అడ్డుకునే దమ్ము రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి ఉందా? అని ప్రశ్నించారు.

అటు, పీసీసీ పీఠం కోసం తెలంగాణలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యనే ప్రధాన పోటీ అని ఇప్పటివరకు కథనాలు వచ్చాయి. అయితే, కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలోకి వెళుతున్నట్టు ప్రకటించడంతో రేవంత్ రెడ్డికి మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. సొంత తమ్ముడ్ని పార్టీ మారకుండా అడ్డుకోలేకపోయారంటూ కోమటిరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మైనస్ మార్కులు వేసే అవకాశముందని, ఇది కచ్చితంగా రేవంత్ కు లాభించే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News