Palakurthi: పాలకుర్తి ఎస్సై పెద్దమనసు... వృద్ధురాలికి ఇల్లు కట్టించిన వైనం!
- ఖాకీ యూనిఫాం వెనుక కరుణ
- ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన వృద్ధురాలు
- వికలాంగుడైన కొడుకుతో దుర్భర జీవనం
- ఇటీవల వర్షాలకు కూలిన ఇల్లు
- చర్చిలో ఆశ్రయం
- వృద్ధురాలి దీనస్థితికి చలించిపోయిన ఎస్సై
జనగాం జిల్లా పాలకుర్రి ఎస్సె గుండ్రాతి సతీశ్ ఓ వృద్ధురాలి దీనగాథ పట్ల చలించిపోవడమే కాకుండా, ఆమెకు ఓ ఇల్లు నిర్మించి ఇచ్చి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఖాకీ వెనుక కూడా హృదయం ఉంటుందని చాటుకున్నారు. పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన బండిపెల్లి రాజమ్మది ఓ విషాద గాథ.
రాజమ్మ వయసు 80 సంవత్సరాలు. ఆమె కుమారుడు వికలాంగుడు. గతేడాది వరకు ఆమె గోడలు, తలుపు సరిగా లేని ఓ రేకుల గదిలో కొడుకు, కోడలు, మనవరాలితో కలిసి నివసించేది. ఏడాది కిందట కోడలు ఆరోగ్యం దెబ్బతిని చనిపోయింది. కనీసం ఆ ఇంటికి తలుపు కూడా లేని నేపథ్యంలో ఆ ఇంట్లోకి పాము ప్రవేశించి ఆరేళ్ల మనవరాలు వర్షితను కాటేసింది. దాంతో ఆ చిన్నారి కూడా ప్రాణాలు వదిలింది. కుటుంబ సభ్యుల మృతితో రాజమ్మ కుంగిపోయింది. కొడుకు పరిస్థితి తలుచుకుని ఆ వృద్ధురాలు తల్లడిల్లిపోయింది.
ఇటీవల కురిసిన వర్షాలకు ఆ చిన్న గది కూడా కూలిపోయింది. దాంతో రాజమ్మకు నిలువ నీడ లేకపోగా, ఓ చర్చిలో ఆశ్రయం పొందింది. అయితే, పాలకుర్తి ఎస్సై గుండ్రాతి సతీశ్ కు ఈ విషయం తెలియడంతో ఆయన కదిలిపోయారు. వృద్ధురాలు రాజమ్మ పరిస్థితిని స్వయంగా చూసిన ఆయన హృదయం ద్రవించిపోయింది.
శాశ్వతంగా ఉండేలా ఆమెకు ఓ ఇల్లు నిర్మించి ఇవ్వాలనుకున్న ఆయన ఖర్చుకు వెనుకాడకుండా రూ.1.60 లక్షలతో పటిష్టమైన ఇల్లు నిర్మించారు. ఇల్లు పూర్తవడంతో తాజాగా రాజమ్మ గృహప్రవేశం చేసింది. తనకు నిలువనీడ కల్పించిన ఎస్సై సతీశ్ ను ఆమె దేవుడిగా అభివర్ణిస్తోంది. నిజమే, దైవం మానుష రూపేణా అని ఊరికే అనలేదు.