Corona Virus: కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు ఆమోదం.. అందుబాటులోకి రానున్న టీకా!
- సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్
- టీకాకు ఆమోదముద్ర వేసిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ
- కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన కమిటీ
కరోనా నియంత్రణ కోసం త్వరలోనే మనకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. కోవిషీల్డ్ టీకాకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ను పూణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. అత్యవసర వినియోగానికి ఈ టీకాను ఉపయోగించవచ్చని కేంద్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్ పంపిణీకి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు భారత్ బయోటెక్ దరఖాస్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
వ్యాక్సిన్ నిల్వ ఉంచడం చాలా ప్రధానమైన అంశం. ఫైజర్ టీకాను నిల్వ చేయడానికి మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో టీకాను నిల్వ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. అదే కోవిషీల్డ్ ను నిలువ చేయడానికి 2 నుంచి 8 డిగ్రీల ఉష్రోగత్ర సరిపోతుంది. అంటే సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత అన్నమాట. దీంతో దీన్ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడం చాలా సులువు అవుతుంది.