New Delhi: గడ్డకడుతున్న ఢిల్లీ.. 15 ఏళ్ల దిగువకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు!
- 1.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
- దట్టంగా కమ్మేసిన పొగ మంచు
- ఎదుట ఏముందో కనిపించని పరిస్థితి
- ఈ నెల 6 వరకు తీవ్రమైన చలిగాలులు
ఢిల్లీ గడ్డకట్టిపోతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 15 ఏళ్లలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నూతన సంవత్సరం తొలి రోజే అక్కడ 1.1 డిగ్రీల శీతల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఢిల్లీ మొత్తాన్ని మంచు దుప్పటి కప్పేసింది. కనీసం మీటర్ దూరంలోని వ్యక్తులు, వాహనాలూ కనిపించని పరిస్థితి ఏర్పడింది. చివరిసారిగా 2006 జనవరి 8న నమోదైన 0.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతే ఇప్పటిదాకా అత్యల్పమని ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు.
ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రెండు అడుగుల దూరంలో ఎదుట ఏముందో కూడా కనిపించని పరిస్థితి ఉందని చెప్పారు. మామూలుగా అయితే మంచు దట్టంగా ఉన్నప్పుడు 51 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు కనిపిస్తుందని, మధ్యస్థంగా ఉంటే 201 మీటర్ల నుంచి అరకిలోమీటర్ వరకు కనిపిస్తుందని తెలిపారు.
పశ్చిమ గాలుల తీవ్రత కారణంగా జనవరి 2 నుంచి జనవరి 6 వరకు ఢిల్లీలో చలి గాలులు వీస్తాయన్నారు. జనవరి 4 నుంచి 5 మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందన్నారు. జనవరి 3 నుంచి 5 మధ్య చిరుజల్లులు కురిసే అవకాశమూ ఉందని శ్రీవాస్తవ వెల్లడించారు.
కాగా, పొగమంచు కారణంగా ఆగ్రా–లక్నో ఎక్స్ ప్రెస్ జాతీయ రహదారిపై 8 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.