COVID19: కరోనా టీకా వేసేందుకు.. 96 వేల మంది యోధులు!

Army of 1 lakh ready to administer vaccine
  • ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన కేంద్ర ప్రభుత్వం
  • సకాలంలో టీకా ఇచ్చేందుకే డ్రైరన్ అంటున్న అధికారులు
  • కొవిషీల్డ్, కొవ్యాగ్జిన్ లకు కేంద్రం అనుమతిచ్చే అవకాశం
దేశ వ్యాప్తంగా కరోనా టీకా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేసేస్తోంది. రేపటి నుంచి టీకా సన్నద్ధ కార్యక్రమాలను (డ్రై రన్) నిర్వహించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మరి, కొన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడమంటే మాటలు కాదు కదా. వ్యాక్సిన్ వేసేవారికి శిక్షణ అవసరం. అందుకే ఇప్పటిదాకా 96 వేల మంది వ్యాక్సిన్ యోధులకు కేంద్ర ప్రభుత్వం శిక్షణనిచ్చింది.

జనాలకు టీకా పంపిణీ చేయడంలో వాళ్లదే కీలకపాత్ర అని, వారికి అన్ని రకాలుగా శిక్షణను ఇచ్చామని ఓ అధికారి చెప్పారు. రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్ స్థాయుల్లో టీకా వేసే ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక క్లాసులు నిర్వహించామన్నారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలించవని, కొన్ని చోట్ల రవాణా సదుపాయాలూ లేవని, అలాంటి ప్రాంతాలకు సకాలంలో టీకా అందించడం కోసమే డ్రైరన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.

కాగా, ఇప్పటికే టీకా కార్యక్రమ నిర్వహణపై నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్.. మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్, హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవ్యాగ్జిన్ టీకాలకు త్వరలోనే కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
COVID19
COVAXIN
Covishield

More Telugu News