'అర్జున్ రెడ్డి' దర్శకుడి హిందీ సినిమా 'ఏనిమల్'

01-01-2021 Fri 12:51
  • 'అర్జున్ రెడ్డి'తో పేరుతెచ్చుకున్న సందీప్ రెడ్డి 
  • 'కబీర్ సింగ్'గా హిందీలో రీమేక్ చేసిన వైనం 
  • రణబీర్ సింగ్ తో ఇప్పుడు 'ఏనిమల్' సినిమా 
  • పరిణీతి చోప్రా నాయిక.. అనిల్ కీలక పాత్ర
Sandeep Reddy to direct Ranabir Kapoor

ఆమధ్య తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఒక సంచలనం. సరికొత్త కథాంశంతో తెలుగులో సాహసోపేతమైన సినిమాగా పేరుతెచ్చుకుంది. అందులో నటించిన విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. అయితే, అతనికి తెలుగులో అవకాశాలు రాకపోయినప్పటికీ, బాలీవుడ్ లో మాత్రం మంచి ఆఫర్స్ వచ్చాయి.

'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరిట హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా ఇది మంచి విజయాన్ని సాధించింది. దీంతో సందీప్ కు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి 'ఏనిమల్' అనే పేరు నిర్ణయించారు. దీనికి సంబంధించిన టైటిల్ లోగోతో పాటు, సినిమా గురించిన వివరాలను తెలుపుతూ ఓ వీడియోను కూడా ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేశారు.  

ఇక ఈ 'ఏనిమల్' సినిమాలో పరిణీతి చోప్రా కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భూషణ్ కుమార్, కిషన్ కుమార్ కలసి సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు. క్రైమ్ డ్రామాను వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపిస్తున్నామని దర్శకుడు సందీప్ రెడ్డి తెలిపారు.