DCGI: భారతీయులకు శుభవార్త చెప్పనున్న డీసీజీఐ!
- ఇది నిజంగానే హ్యాపీ న్యూ ఇయర్
- డీసీజీఐ వీజీ సోమని కీలక వ్యాఖ్యలు
- నేడు వ్యాక్సిన్ కు అనుమతి లభించే అవకాశం
- కీలక సమావేశం నిర్వహించనున్న డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్
కరోనా నుంచి భారతీయులను కాపాడేలా ఓ శుభవార్త రానుందని డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) వీజీ సోమని వెల్లడించారు. ఈ సంవత్సరం నిజంగానే హ్యాపీ న్యూ ఇయర్ అని అన్నారు. కొత్త సంవత్సరంలో భారతీయులు సంబరాలు చేసుకోవచ్చని ఆయన అన్నారు.
వ్యాక్సిన్ ను ఇప్పటికే తయారు చేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్ తో పాటు భారత్ బయోటెక్, ఫైజర్ కంపెనీలు వాడకానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నేడు మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో సోమని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇప్పటికే ఈ సంస్థలన్నీ ఇచ్చిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ, కేంద్రానికి నివేదికను కూడా అందించింది. ఈ నేపథ్యంలో నేడే వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, టీకా భద్రత, సామర్థ్యం విషయంలో రాజీ పడబోమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇండియాలోని పరిశోధనా సంస్థలతో పాటు బయో టెక్నాలజీ విభాగానికి ఇది అత్యంత పరీక్షా సమయమని సోమని వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి, పంపిణీ ప్రారంభమైతే ఎటువంటి సమాచార లోపం లేకుండా జాగ్రత్త పడేందుకు కేంద్రం ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేసి, నివేదికను విడుదల చేసింది. జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ సమాచారాన్ని పంచుకునేందుకు ఓ ప్రత్యేక వ్యూహాన్ని రచించింది. ప్రజల్లో వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగించి, అందరికీ టీకాను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే రేపు దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్ కొనసాగనుంది. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించి, తగు జాగ్రత్తలు తీసుకోవడమే ఈ డ్రైరన్ ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ విజయవంతమైన సంగతి తెలిసిందే.