రవితేజ 'క్రాక్'కి వెంకీమామ మాట సాయం!

31-12-2020 Thu 20:56
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్'
  • రవితేజ సరసన నాయికగా శ్రుతిహాసన్
  • వాయిస్ ఓవర్ ఇస్తున్న హీరో వెంకటేశ్    
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు సినిమా
Venkatesh lends his voice for Raviteja movie

ఒక హీరో సినిమాకి మరో హీరో వాయిస్ ఓవర్ చెబితే ఆ చిత్రానికి అదో ప్లస్ పాయింట్ అవుతుందని ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే, సినిమా కథను నడిపించే వాయిస్ ఓవర్ లను ఆయా స్టార్ హీరోల చేత చెప్పిస్తుంటారు. అలాగే తాజాగా ప్రముఖ హీరో వెంకటేశ్ కూడా రవితేజ నటిస్తున్న చిత్రానికి మాట సాయం చేస్తున్నారు.

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాజాగా 'క్రాక్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'క్రాకింగ్ న్యూస్' అంటూ ఈ విషయాన్ని సదరు సంస్థ అభిమానులతో పంచుకుంది. అంతేకాదు, 'వెంకీమామ ఫర్ క్రాక్' అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.

ఇక ఈ చిత్రం ప్రోగ్రెస్ విషయానికి వస్తే, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరాయి. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను రేపు నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.