Balineni Srinivasa Reddy: టీడీపీ హయాంలో విద్యుత్ సంస్థలను ముంచేస్తే మేం గట్టెక్కించాం: మంత్రి బాలినేని
- టీడీపీ హయాంలో ఒప్పందాలు అవినీతిమయమని వెల్లడి
- విద్యుత్ సంస్థలు వేల కోట్ల అప్పుల్లో చిక్కుకున్నట్టు వివరణ
- గత ఏడాదిగా రూ.30 వేల కోట్లు ఇచ్చామని స్పష్టీకరణ
- లాభాల బాట పట్టించామని ఉద్ఘాటన
టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలను నిండా ముంచేశారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లు సర్వం అవినీతిమయం అని విమర్శించారు. రూ.70 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలను తమ ప్రభుత్వం గట్టెక్కించిందని, గడచిన ఏడాది కాలంలో విద్యుత్ సంస్థల పునరుజ్జీవం కోసం రూ.30 వేల కోట్లకు పైగా ఇచ్చామని వెల్లడించారు.
విద్యుత్ సంస్థలు మళ్లీ లాభాల బాట పట్టాయంటే అది వైసీపీ ప్రభుత్వ చలవేనని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యతతో కూడిన విద్యుత్ అందించాలని కోరుకుంటున్నామని, వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బాలినేని వెల్లడించారు. ఈ ఖరీఫ్ సీజన్ నాటికి 100 శాతం లక్ష్యాలను చేరుకుంటామన్న నమ్మకం ఉందని తెలిపారు.