'జెర్సీ' దర్శకుడితో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ

31-12-2020 Thu 16:45
  • ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలలో చరణ్ 
  • చరణ్ కు కథలు చెప్పిన పలువురు దర్శకులు
  • 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి గ్రీన్ సిగ్నల్
  • జోరుగా సాగుతున్న ప్రీ ప్రొడక్షన్ పనులు  
Ram Charans pan India movie with Jersey director

స్టార్ హీరోలు నటించే కొత్త సినిమాల విషయంలో అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన హీరో నటించే తదుపరి సినిమా ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి ఆయా తారల అభిమానులు ఉత్సుకత చూపుతుంటారు. ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ విషయంలో కూడా అలాంటి ఆసక్తే నెలకొంది.

ప్రస్తుతం చరణ్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. వీటిలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం ముగింపు దశకి చేరింది. అలాగే, తండ్రి చిరంజీవితో కలసి 'ఆచార్య' సినిమాలో కూడా చరణ్ నటిస్తున్నాడు. 'ఆర్ఆర్ఆర్' పూర్తయిన  తర్వాత ఈ చిత్రం షూటింగులో పాల్గొంటాడు.

ఇక ఈ రెండింటి తర్వాత ఆయన నటించే సినిమా ఏమిటి? అన్నది చూస్తే, ఇటీవలి కాలంలో చరణ్ చాలా మంది దర్శకులు చెప్పిన పలు కథలు విన్నాడు. వీటిలో 'జెర్సీ'  ఫేమ్ గౌతమ్ తిన్ననూరి  చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందట. దాంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ తయారుచేసే పనిలో గౌతమ్ ఉన్నాడనీ, చరణ్ నటించే తదుపరి సినిమా ఇదేనని తెలుస్తోంది. పైగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున నిర్మించడానికి ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.