India: మన దేశంలో ఒక్క రోజులో 6 నుంచి 20కి పెరిగిన కొత్త కరోనా కేసులు!

New Corona Strain Cases Rise in India from 6 to 20 in 24 Hours

  • ఇప్పటికే పలు దేశాలకు విస్తరణ
  • బెంగళూరు, ఢిల్లీలో కొత్త వైరస్
  • జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్న నిపుణులు

బ్రిటన్ లో వెలుగులోకి వచ్చి, ఆపై ఇండియా సహా పలు దేశాలకు విస్తరించిన కొత్త కరోనా స్ట్రెయిన్ శరవేగంగా వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్నటికి కొత్త కరోనా కేసులు కేవలం ఆరు మాత్రమే ఉండగా, 24 గంటల వ్యవధిలో మొత్తం 20 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది.

మంగళవారం నాడు ఆరుగురికి కొత్త వైరస్ సోకిందని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ, తాజాగా, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోనూ న్యూ స్ట్రెయిన్ కనిపించిందని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఈ వైరస్ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, కెనడా, జపాన్ తదితర ఎన్నో దేశాల్లో కనిపించగా, అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదే సమయంలో కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పాటిస్తుంటే, కొత్త వైరస్ కూడా సోకకుండా ఉంటుందని సీసీఎంబీ పేర్కొంది. మాస్క్ లు, భౌతికదూరం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కొత్త స్ట్రెయిన్ కు కూడా దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచించారు.

ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్, కొత్త స్ట్రెయిన్ ను కూడా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ రూపాంతరం చెందిన కరోనా, 70 శాతం వరకూ అధికంగా వ్యాపిస్తుండటం కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, పెద్దగా భయపడాల్సిందేమీ లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా, అమెరికాలోని కొలరాడోలో కొత్త కరోనా వైరస్ ఓ వ్యక్తిలో కన్ఫర్మ్ అయిందని రాష్ట్ర గవర్నర్ జేరెడ్ పోలిస్ ప్రకటించారు. అతన్ని ప్రస్తుతం ఐసొలేట్ చేశామని, అతన్ని కలిసిన మరో 20 మందిని గుర్తించి క్వారంటైన్ చేశామని, అతని ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News