Rajahmundry: ఏపీలో కొత్త స్ట్రెయిన్ కలకలం.. రాజమండ్రికి చెందిన ఆంగ్లోఇండియన్ మహిళలో గుర్తింపు
- ఈ నెల 22న బ్రిటన్ నుంచి రాక
- ఢిల్లీలో పరీక్షలు చేయించుకుని తప్పించుకుని వచ్చిన మహిళ
- కాకినాడకు చెందిన మరో వ్యక్తి ద్వారా మరో ముగ్గురికి
బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కూ పాకింది. రాజమండ్రి రూరల్ మండలంలోని రామకృష్ణనగర్‌కు చెందిన ఆంగ్లోఇండియన్ మహిళలో ఈ కొత్త జాతి వైరస్‌ను గుర్తించారు. ఈ నెల 22న ఆమె బ్రిటన్ నుంచి ఢిల్లీకి వచ్చారు. యూకే బయలుదేరేటప్పుడు ఆమె పరీక్షలు చేయించుకున్నా, ఫలితాలు రాకముందే ఆమె భారత్ వచ్చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత అక్కడ కూడా పరీక్షలు చేశారు.
ఫలితాలు వచ్చే వరకు అక్కడే క్వారంటైన్‌లో ఉండాలి. అయితే, ఆమె తప్పించుకుని తనను రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయానికి వచ్చిన కుమారుడితో కలిసి ఈ నెల 23న రాజమండ్రి చేరుకున్నారు. ఆ తర్వాత వచ్చిన పరీక్షల్లో ఆమెకు యూకే స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
బ్రిటన్ నుంచి ఇటీవల మొత్తం 114 మంది రాగా, వారిలో 111 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో కాకినాడ వెంకట్ నగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా, అతను కలిసిన మరో ముగ్గురికి కూడా పాజిటివ్ అని తేలింది. తదుపరి పరీక్షల కోసం వారి నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.