Jagga Reddy: కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. రేపటి దీక్షను రద్దు చేసుకున్నాం: జగ్గారెడ్డి
- ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలన్న ప్రభుత్వం
- ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని తొలి నుంచి డిమాండ్ చేస్తున్నామన్న జగ్గారెడ్డి
- ప్రజల డిమాండ్ మేరకు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం
ఎల్ఆర్ఎస్ అంశం ఇటీవల తెలంగాణను అట్టుడుకించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు బిల్డర్లు, ప్రజలు ధర్నాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కీలక ప్రకటన చేసింది. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి డిమాండ్ చేస్తోందని చెప్పారు. కరోనాతో రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్న సమయంలో... రిజిస్ట్రేషన్లను ఆపి, ఎల్ఆర్ఎస్ కచ్చితంగా కట్టాలనే నిర్ణయం సరికాదని తాము ముందు నుంచి చెపుతున్నామని అన్నారు.
ప్రజల డిమాండ్ మేరకు ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసిన నేపథ్యంలో రేపు గాంధీభవన్ లో తాము చేపట్టాలనుకున్న దీక్షను రద్దు చేసుకున్నామని చెప్పారు.