Telangana: ఎల్ఆర్ఎస్ పై వెనక్కి తగ్గిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్లకు అనుమతి!
- రిజిస్ట్రేషన్లకు లైన్ క్లియర్ చేస్తూ ఉత్తర్వుల జారీ
- ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మందికి ఊరట
- కొత్త ప్లాట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి
తెలంగాణ ప్రజలకు ఊరటనిచ్చే వార్త ఇది. ఎల్ఆర్ఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఎల్ఆర్ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొత్తగా వేసే ప్లాట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పని సరి అని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పాత లే అవుట్ల భూములకు లైన్ క్లియర్ అయింది. ఈ అంశంపై ఈరోజు ప్రభుత్వం చర్చలు జరిపింది. కాసేపటి క్రితం తాజా ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మందికి ఊరట కలగనుంది. ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో భూ యజమానులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్నత విద్య, వివాహాలు తదితర కారణాల వల్ల ప్లాట్లు అమ్ముకోవాలనుకుంటున్న వారు... ఎల్ఆర్ఎస్ నిబంధన వల్ల తమ ప్రాపర్టీ అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఊరటను కల్పించింది.