Russia: రష్యా సైన్యంలోనే ఆమె అందగత్తె.. అసూయతోనే ఉద్యోగం నుంచి తీసేశారని ఆరోపణ!
- సౌందర్య పోటీల్లో గెలిచానన్న అక్కసుతోనే కక్ష గట్టారని మండిపాటు
- బికినీ ఫొటోలు పోస్ట్ చేసినందుకు తొలగించారని ఆవేదన
- సైనిక రహస్యాలు తెలిసేలా వీడియో పోస్ట్ చేసినందుకేనంటున్న అధికారులు
రష్యా సైన్యంలోనే అపురూప సౌందర్యవతి ఆమె. వెయ్యి మందిలో నిలిచి గెలిచిన అందగత్తె ఆమె. కానీ, ఆమెను రష్యా సైన్యం నుంచి తొలగించేశారు. ఓ వర్గం తనపై అసూయ పెంచుకోవడమే దానికి కారణమని ఆమె ఆరోపించింది. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే.. ఆమె తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులంతా సైన్యంలోనే ఉన్నారు.
ఆమె పేరు అన్నా ఖ్రమత్సోవా. రష్యా నేషనల్ గార్డ్స్ లో సైనికురాలు. ఇటీవల నేషనల్ గార్డ్స్ నిర్వహించిన అందగత్తెల పోటీల్లో పాల్గొంది. వెయ్యి మందిలో విజేతగా నిలిచింది. ఆ గెలుపుతో దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంతర్గత సైనిక బృందంలోని మహిళా సైనికులకు తనపై ఈర్ష్య పుట్టిందని, గెలిచానన్న అక్కసుతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేసి బలగాల నుంచి తప్పించేలా చేశారని ఖ్రమత్సోవా ఆరోపించింది.
పోటీల తర్వాత తనకు శత్రువులు ఎక్కువైపోయారని వాపోయింది. తన రోజువారీ అలవాట్లు, ఆటలు, రోజువారీ జీవితం గురించి పూర్తిగా తెలుసుకున్నారని, అప్పటి నుంచి తనను బయటకు పంపించేందుకు కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను బికినీల్లో తీసుకున్న ఫొటోలను సాకుగా చూపి ఉద్యోగం నుంచి తీసేశారంది.
అయితే, ఆమెను ఉద్యోగం నుంచి తీసేయడానికి కారణం అది కాదని అధికారులు చెబుతున్నారు. ఆర్మీ ప్రాంతం, రహస్యాలు తెలిసేలా ఓ వీడియోను పోస్ట్ చేయడం వల్లే ఆమెను తొలగించాల్సి వచ్చిందంటున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్మీకి చెందిన బిల్డింగ్ ను శుద్ధి (డిసిన్ఫెక్షన్) చేస్తున్నప్పుడు తీసిన వీడియోను ఆమె పోస్ట్ చేసిందంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియోను అధికారులు తొలగించారు.