Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని అడ్డుకున్న వ్యతిరేక వర్గం!
- మల్లపల్లిలో ఇళ్ల పట్టాల కార్యక్రమం
- వేదిక వద్దకు వెళ్లనివ్వకుండా వంశీని అడ్డుకున్న మరొక వర్గం
- భారీఎత్తున మోహరించిన పోలీసులు
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైసీపీలోని ఓ వర్గం నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఈ ఉదయం బావులపాడు మండలం, మల్లపల్లిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి వచ్చిన ఆయన్ను, వేదిక వద్దకు వెళ్లనీయకుండా ఓ వర్గం కార్యకర్తలు అడ్డుకున్నారు.
తమ గ్రామంలోకి రావద్దంటూ, రోడ్డుపై బైఠాయించి, వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో వంశీ అనుకూల వర్గం కూడా రంగంలోకి దిగడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
విషయం తెలుసుకున్న పోలీసులు, భారీ ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఇటీవలి కాలంలో గన్నవరంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా, ఎమ్మెల్యేకు అనుకూల, వ్యతిరేక వర్గాలు అక్కడికి చేరుకుని ఉద్రిక్తతలను పెంచుతున్నారు.