Ilayaraja: ప్రసాద్ ల్యాబ్స్, ఇళయరాజా మధ్య సమసిపోయిన వివాదం!

Case Solved Between Ilayaraja and Prasad Studios

  • 1976 నుంచి ప్రసాద్ స్టూడియోలో రికార్డింగ్ ల్యాబ్
  • కొన్నేళ్ల క్రితం మనస్పర్థలు
  • కోర్టు ఆదేశాలతో పరికరాలు తీసుకెళ్లిన ఇళయరాజా సహాయకులు

చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ లో ఉన్న రికార్డింగ్ ల్యాబ్, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాల మధ్య ఉన్న వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. పోలీసు బందోబస్తు మధ్య ఇళయరాజా సహాయకులు ల్యాబ్ కు వచ్చి, సంగీత వాయిద్యాలను, రికార్డింగ్ పరికరాలను తీసుకుని వెళ్లారు. 1976లో ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా కోసం ఓ గదిని రికార్డింగ్ స్టూడియోగా ఏర్పాటు చేశారు. అయితే, ఇటీవల స్టూడియో యాజమాన్యంతో రాజాకు మనస్పర్థలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ కేసు మద్రాస్ హైకోర్టులో రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. చివరకు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకూ సూచించింది. స్టూడియోలో తాను వాడే పరికరాలను, అక్కడ ఉన్న అవార్డులను తీసుకెళతానని, అక్కడ కాసేపు ధ్యానం చేసుకునేందుకు అనుమతించాలని ఇళయరాజా కోర్టులో మరో పిటిషన్ వేయగా, తొలుత వ్యతిరేకించిన ప్రసాద్ స్టూడియో, ఆ తరువాత కొన్ని షరతులు విధిస్తూ అంగీకరించింది.

కోర్టు సైతం పరికరాలను తీసుకుని వెళ్లేందుకు అనుమతించడంతో, సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళయరాజా స్టూడియో వద్దకు వస్తారని ప్రకటన కూడా వెలువడింది. అయితే, ఆయనకు బదులుగా సహాయకులు వచ్చారు. అప్పటికే ఇళయరాజా వాడే స్టూడియో తలుపులను పగులగొట్టి, అందులోని పరికరాలను మరో గదికి తరలించినట్టు వారు గుర్తించారు. ఈ సమాచారాన్ని ఇళయరాజాకు తెలియజేయడంతో, మనస్తాపం చెందిన ఆయన స్టూడియో వద్దకు రాలేదు.

ఆపై పోలీసు బందోబస్తు మధ్య, వీడియో చిత్రీకరిస్తూ, ఇళయరాజా వాడిన సామగ్రిని తీసుకుని వెళ్లారు. దీంతో దీర్ఘకాల వివాదానికి తెరపడినట్లయింది.

  • Loading...

More Telugu News