Tomer: నరేంద్ర మోదీపై ఎంత ఒత్తిడి పెట్టినా తలొగ్గరు... రైతులకు స్పష్టం చేసిన కేంద్రం!

  • 40 మంది రైతులను చర్చలకు పిలిచిన కేంద్రం
  • రైతు వ్యవస్థను బలోపేతం చేయడమే చట్టాల ఉద్దేశం
  • అనుమానాలను మాత్రం నివృత్తి చేస్తాం
  • మోదీ నిబద్ధత గల వ్యక్తన్న తోమర్
Preasure didnot work on Modi says Tomer

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతుండగా, ఢిల్లీకి దారితీసే అన్ని జాతీయ రహదారులపై గత కొన్ని రోజులుగా రైతులు బైఠాయించి కూర్చున్న నేపథ్యంలో.. ఎంత ఒత్తిడి పెట్టినా ప్రధాని నరేంద్ర మోదీ తలొగ్గబోరని కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 30న మరో విడత చర్చల కోసం 40 మంది రైతులను కేంద్రం ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, ఈ చట్టాల వెనుక రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ చట్టాల విషయంలో నరేంద్ర మోదీ వెనక్కు తగ్గేలా చేయగల ఏ శక్తీ లేదని ఆయన అన్నారు.

కాగా, తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన ప్రధాని, భారత వ్యవసాయ రంగాన్ని, రైతు వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు వేయడానికే నిర్ణయించామని, ఈ చట్టాలను వెనక్కు తీసుకునే అవకాశాలు లేవని, ఇదే సమయంలో రైతులకు ఉన్న అన్ని అనుమానాలనూ నివృత్తి చేసే విషయంలో కట్టుబడివున్నామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఇక తనను కలిసిన రైతులతో మాట్లాడిన తోమర్, "యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, శరద్ పవార్ వంటి వారు ఇవే చట్టాలను అమలు చేయాలని చూశారు. అయితే, వారిపై వచ్చిన ఒత్తిడి కారణంగానే వెనక్కు తగ్గారు. అందువల్లే ఎప్పుడో అమలు కావాల్సిన చట్టాలు ఆలస్యం అయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ ప్రస్తుత ప్రధాని అటువంటి రకం కాదు" అని అన్నారు.

చట్టాల విషయంలో మోదీకి ఎటువంటి స్వీయ లాభాలూ లేవని, ఆయన కేవలం దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని మాత్రమే కోరుకుంటూ, సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు సాగుతున్నారని అన్నారు. నిబద్ధతతో పనిచేసే మోదీ వంటి నేతను ఎవరూ ప్రభావితం చేయలేరని అన్నారు.

More Telugu News