UK: వరంగల్ జిల్లా వ్యక్తిలో యూకే వైరస్ గుర్తింపు.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ

  • ఈ నెల 10న యూకే నుంచి హైదరాబాద్‌కు
  • 16న బయటపడిన లక్షణాలు
  • సీసీఎంబీ పరీక్షల్లో కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ
  • ఆయన తల్లికి కూడా పాజిటివ్
UK Corona strain found in Warangal man who returns from Britain

బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్‌లోని కొత్త రకం తాజాగా తెలంగాణకు కూడా పాకినట్టు తెలుస్తోంది. ఈ నెల 10న యూకే నుంచి రాష్ట్రానికి చేరుకున్న వరంగల్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించారు. అతనికి కరోనా స్ట్రెయిన్ ఉన్నట్టు సీసీఎంబీ నిర్ధారించినా, ఆరోగ్య శాఖ నుంచి మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.

 బ్రిటన్ నుంచి వచ్చిన ఆ వ్యక్తిలో ఈ నెల 16న కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో స్థానికంగా పరీక్షలు చేయించారు. ఈ నెల 22న ఫలితాలు రాగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వెంటనే అక్కడే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

అయితే, ఆయన బ్రిటన్ నుంచి రావడంతో రెండు రోజుల క్రితం నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. పరీక్షించిన శాస్త్రవేత్తలు ఆయనకు సోకింది కొత్త స్ట్రెయినేనని నిర్ధారించారు. ఈ సమాచారాన్ని ఆదివారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు.

బాధితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఆయన భార్యకు నెగటివ్‌ రాగా, 71 ఏళ్ల ఆయన తల్లికి మాత్రం వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్చి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించారు. తల్లి, కుమారుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

మరో వారం, పదిరోజులపాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్టు చెప్పారు. వారికి మరో రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, అందులో యూకే వైరస్ నెగటివ్ అని వస్తేనే ఇంటికి పంపిస్తామని వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, బాధితుడితో సన్నిహితంగా మెలిగిన అందరినీ రెండు వారాలపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు కోరారు.

More Telugu News