Siblings: ప్రపంచంతో సంబంధం లేకుండా.... పదేళ్లుగా ఒకే గదిలో ముగ్గురు తోబుట్టువులు!

Three siblings in Rajkot lacked in a room nearly a decade

  • రాజ్ కోట్ లో ఘటన
  • తల్లి మరణంతో గదికే పరిమితం
  • ఆహారం అందిస్తున్న తండ్రి
  • ముగ్గురూ విద్యాధికులే
  • ముగ్గురిలో ఒకరు యువతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లో ముగ్గురు తోబుట్టువులు గత పదేళ్లుగా తక్కిన ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే గదిలో ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. వారందరూ విద్యాధికులే కావడం మరో నివ్వెరపరిచే అంశం. వారి పేర్లు అమ్రీష్ మెహతా (42), మేఘనా మెహతా (39), భవేశ్ మెహతా (30). తమ తల్లి చనిపోయినప్పటి నుంచి వారు ఆ గది నుంచి బయటికి రాలేదు. తండ్రి నవీన్ భాయ్ మెహతా వారికి ఆహారం అందిస్తుంటారు.

అయితే ఈ ముగ్గురు తోబుట్టువుల సంగతి ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వెల్లడి చేసింది. ఆ ఎన్జీవోకు చెందిన అధికారులు రాజ్ కోట్ లోని సంపన్నులు నివసించే కిషన్ పారా ప్రాంతంలోని ఆ ఇంటికి వెళ్లారు. ఆ గది తలుపులు తెరిచి చూడగా చిక్కి శల్యమైన స్థితిలో ఆ ముగ్గురు తోబుట్టువులు కనిపించారు. గదిలో మలమూత్రాదుల వాసనలు ఎన్జీవో సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అక్కడ పాచిపోయిన ఆహారం దర్శనమిచ్చింది. తైల సంస్కారం లేని జుట్టు, గడ్డాలతో ఇరువురు సోదరులు, అత్యంత బలహీన స్ధితిలో వారి సోదరి నేలపై నీరసంగా పడుకుని ఉన్నారు.

తన ఇంటికి ఎన్జీవో సభ్యులు వచ్చారని తెలుసుకున్న వారి తండ్రి నవీన్ భాయ్ మెహతా వెంటనే అక్కడికి చేరుకుని, తల్లి పోయిన తర్వాత తన బిడ్డలు ఇలా తయారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇరుగుపొరుగు వారు మాత్రం మరోలా చెబుతున్నారు. తండ్రికి మూఢనమ్మకాలు విపరీతం అనీ, తన పిల్లలను చేతబడి నుంచి రక్షించుకోవడానికి ఇలా గదిలో దాచాడని అంటున్నారు.  

కాగా, ఆ ముగ్గురిలో పెద్దవాడైన అమ్రీష్ బీఎ ఎల్ఎల్ బీ చదివి లాయర్ గానూ పనిచేశాడు. మేఘన ఎంఏ సైకాలజీ విద్యాధికురాలు కాగా, చిన్నవాడైన భవేశ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాదు, మంచి భవిష్యత్తు ఉన్న క్రికెటర్ గా అప్పట్లో గుర్తింపు పొందాడట. వీరి పరిస్థితి పట్ల సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి, ఆపై ఓ సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఎన్జీవో సిబ్బంది భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News