Andhra Pradesh: ఏపీలో కొత్త వైరస్ ఆనవాళ్లు బయటపడలేదు: వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్
- ఇప్పటి వరకు 1,363 మంది యూకే నుంచి రాష్ట్రానికి వచ్చారు
- వీరిలో 11 మందికి కరోనా నిర్ధారణ అయింది
- పూణె ల్యాబ్ నుంచి రిపోర్టులు రావాల్సి ఉంది
యూకేలో శర వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్... ఇతర దేశాలకు కూడా పాకుతోంది. ఆ స్ట్రెయిన్ మన దేశంలోకి కూడా ప్రవేశించిందా? అనే ఆందోళనలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏపీలో ఇంత వరకు కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు బయట పడలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.
ఈ స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,363 మంది యూకే నుంచి రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. వీరిలో 1,346 మందిని క్వారంటైన్ కు పంపామని... మరో 17 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన వారిలో 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని... వారికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారిలో 12 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. వీరి శాంపిల్స్ ని పూణె వైరాలజీ ల్యాబ్ కు, హైదరాబాదులోని సీసీఎంబీకి పంపించామని... ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు.