Donald Trump: నిర్ణయాన్ని మార్చుకున్న ట్రంప్.. ఆర్థిక ఉపశమన బిల్లుపై సంతకం.. లక్షలాది మందికి లబ్ధి!
- ట్రంప్ సంతకం చేయడంతో కోట్లాది మంది హర్షం
- 95 లక్షల మందికి లబ్ధి
- అందుబాటులోకి రూ.66.37 లక్షల కోట్ల ప్యాకేజీ
ఆర్థిక ఉపశమన బిల్లుపై సంతకం చేసేది లేదంటూ మొండికేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తీసుకొచ్చిన ఆర్థిక ఉపశమన బిల్లుపై ఎట్టకేలకు సంతకం చేశారు. దీంతో అమెరికా పెను సంక్షోభం నుంచి బయటపడినట్టు అయింది. అంతేకాదు, కూలిపోయే ప్రమాదం నుంచి ప్రభుత్వం తప్పించుకుంది.
ట్రంప్ ఈ బిల్లుపై సంతకం పెట్టకుండా తప్పించుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ట్రంప్ తీరుతో కోటిమందికిపైగా అమెరికన్లు ఉపాధి బీమా లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అంతేకాదు, ప్రభుత్వ నిధుల కాలపరిమితి ముగిస్తే కనుక ముఖ్యమైన సేవలు, సైనిక సిబ్బందికి ఇచ్చే వేతనాలు ప్రమాదంలో పడతాయి. లక్షలాది మంది జీవితాలు చీకట్లోకి వెళ్లిపోతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉద్దీపన బిల్లుపై ట్రంప్ సంతకం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ట్రంప్ సంతకం చేయడంతో దాదాపు 95 లక్షల మంది అమెరికన్లకు లబ్ధి చేకూరనుంది. నిరుద్యోగ ప్రాయోజిత పథకాల కింద మరో 11 వారాలపాటు తోడ్పాటు లభిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా దారుణంగా నష్టపోయిన అమెరికన్లకు ఆర్థిక సాయం అందించాలన్న ఉద్దేశంతో 900 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.66.37 లక్షల కోట్లు) ప్యాకేజీతో తీసుకొచ్చిన ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదించినప్పటికీ ట్రంప్ మాత్రం సంతకం చేసేందుకు నిరాకరించారు. తాజాగా మనసు మార్చుకున్న ట్రంప్ సంతకం చేయడంతో అమెరికన్లకు భారీ ఊరట లభించింది.