Potharaju: బోనాల ఉత్సవాల పోతరాజు పహిల్వాన్ నారాయణ మృతి
- 1962 నుంచి 2015 వరకు పోతరాజుగా వేషాలు
- ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల నుంచి ప్రశంసా పత్రాలు
- విజయభాస్కరరెడ్డి చేతుల మీదుగా సాంస్కృతిక అవార్డు
హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ బోనాల ఉత్సవాల సందర్భంగా పోతరాజుగా కనిపించే పహిల్వాన్ నారాయణ మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఉదయం కన్నుమూశారు. ఓల్డ్ అల్వాల్‌లోని పోచమ్మ దేవాలయ బోనాల సందర్భంగా 1962 నుంచి ఆయన పోతరాజు వేషాలు వేస్తున్నారు. 2015 వరకు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక ఉత్సవాలతోపాటు ఆసియా క్రీడల్లోనూ నారాయణ ప్రదర్శనలు ఇచ్చారు.
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల నుంచి నారాయణ ప్రశంసా పత్రాలు అందుకున్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి నుంచి సాంస్కృతిక అవార్డు, రాష్ట్రపతులు జైల్‌సింగ్, శంకర్ దయాళ్ శర్మ నుంచి అభినందనలు అందుకున్నారు. పలు కుస్తీ పోటీల్లోనూ నారాయణ రాణించడంతో పహిల్వాన్ నారాయణగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత హెచ్ఎంటీలో ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ పోతరాజు వేషాలు వేయడం మాత్రం ఆయన మానలేదు.