GVL Narasimha Rao: వ్యవసాయ చట్టాలను రద్దు చేయం... రైతుల అభ్యంతరాలకు అనుగుణంగా మార్పులు చేస్తాం: జీవీఎల్
- అమరావతిలో బీజేపీ రైతు సాధికారత సదస్సు
- హాజరైన ఏపీ బీజేపీ అగ్రనేతలు
- వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవన్న జీవీఎల్
- రైతులకు మేలు చేస్తాయని వెల్లడి
- విపక్షాల ప్రచారంలో నిజంలేదని స్పష్టీకరణ
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్ర వ్యవసాయ చట్టాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నిర్వహించిన బీజేపీ రైతు సాధికారత సదస్సులో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అయితే రైతుల ఇబ్బందులు పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనతోనే మోదీ ఈ చట్టాలు తెచ్చారని వెల్లడించారు.
ఆ మూడు వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని, రైతుల డిమాండ్ల నేపథ్యంలో వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తామని చెప్పారు. సంక్షోభానికి గురైన దేశ వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు నూతన చట్టాలకు రూపకల్పన చేశారని వివరించారు. ఈ చట్టాలు మూడు దశాబ్దాల కింద వచ్చుంటే రైతులు ఈపాటికి ఎంతో అభివృద్ధి చెంది ఉండేవారని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.
ఈ చట్టాలతో రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని, గతంతో పోలిస్తే రైతుకు రెండు రెట్లు అధికంగా ధర వస్తుందని, కనీస మద్దతు ధరకు లోటు లేదని అన్నారు. భూమిని లాగేసుకుంటారని విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కాగా, అమరావతిలో నిర్వహించిన ఈ సదస్సులో జీవీఎల్ తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.