Mallu Ravi: రేవంత్ కు పీసీసీ ఇవ్వాలని బహిరంగంగానే చెప్పా... అందులో చెంచాగిరీ ఏముంది?: మల్లు రవి
- రేవంత్ కే పీసీసీ పదవి అంటూ ప్రచారం
- ఇతర కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలు చేసిన వీహెచ్
- వీహెచ్ వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి
- రేవంత్ కు ఇవ్వాలని కోరడంలో తప్పేముందన్న మాజీ ఎంపీ
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ మల్లు రవి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి కట్టబెడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీహెచ్... మల్లు రవిపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై ఘాటుగా స్పందించిన మల్లు రవి... తాను ఎవరికీ చెంచాగిరీ చేయడంలేదని, రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని బహిరంగంగానే చెప్పానని స్పష్టం చేశారు.
వైద్య విద్యను అభ్యసించిన తాను ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తమ ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారని, ఆయనకే పీసీసీ అధ్యక్ష పీఠం అప్పగించాలని కోరడంలో తప్పేమీ లేదని అన్నారు.
పీసీసీ పదవి ఎవరికివ్వాలని ఇన్చార్జి మాణికం ఠాగూర్ అడిగారని, ఎవరైనా మరొకరి పేరు చెబితే వారికి చెంచాగిరీ చేస్తున్నట్టా? అని ప్రశ్నించారు. మాణికం ఠాగూర్ ను తప్పుబడితే హైకమాండ్ ను తప్పుబట్టినట్టేనని మల్లు రవి స్పష్టం చేశారు. ఏదేమైనా నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్ఠానమేనని అభిప్రాయపడ్డారు.