COVID19: కరోనా వైరస్ లో నెలకు రెండు ఉత్పరివర్తనాలు: ఎయిమ్స్ డైరెక్టర్
- పది నెలల్లో వైరస్ ఎన్నో రూపాలు మార్చిందన్న రణ్ దీప్ గులేరియా
- ‘బ్రిటన్ వైరస్’పై ఆందోళన అవసరం లేదని భరోసా
- ఇప్పుడున్న టీకాలూ దానిపై పనిచేస్తాయని వెల్లడి
బ్రిటన్ లో రూపు మార్చుకున్న కొత్త కరోనా గురించి ప్రస్తుతం ప్రతి దేశమూ బెంగ పెట్టుకుంది. దాని వల్ల ఇంకెన్ని దారుణాలు జరుగుతాయోనన్న భయాందోళనలూ వెంటాడుతున్నాయి. అయితే, దానిపై అంత ఆందోళన అవసరం లేదని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్, కొవిడ్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణ్ దీప్ గులేరియా అంటున్నారు. దేశంలో పది నెలల్లో కరోనా వైరస్ ఎన్నో రూపాలు మార్చుకుందని, అది సాధారణంగా జరిగేదేనని చెప్పారు.
నెలకు సగటున వైరస్ లో రెండు ఉత్పరివర్తనాలు జరిగాయని ఆయన వివరించారు. వైరస్ మారినా అది సోకినప్పుడు కలిగే లక్షణాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవన్నారు. కరోనా చికిత్స కూడా మారలేదని, మార్చాల్సిన అవసరమూ లేదని చెప్పారు. ప్రస్తుతం వివిధ దశల ట్రయల్స్ లో ఉన్న టీకాలన్నీ ‘బ్రిటన్ వైరస్’పై సమర్థంగా పనిచేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కరోనా కేసులు, మరణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని, రాబోయే 8 నెలలు కరోనాతో పోరులో మనకు కీలకమని అన్నారు.
చాలా వేగంగా వ్యాప్తి చెందడం వల్లే బ్రిటన్ వైరస్ పై ఎక్కువ భయాలు నెలకొన్నాయని ఆయన చెప్పారు. ఈ రకం వైరస్ సోకినా ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదని వివరించారు. దీని వల్ల సంభవిస్తున్న మరణాలు తక్కువేనన్నారు. వైరస్ లో పెద్ద పెద్ద మార్పులు ఏవైనా జరిగితే.. దానిపైనా సమర్థంగా పనిచేసేలా శాస్త్రవేత్తలు, సంస్థలు టీకాల్లో మార్పులు చేయగలవని అన్నారు. అయితే, ప్రస్తుతం వైరస్ లో అంత పెద్ద మార్పులేమీ జరగట్లేదని, ఇప్పుడున్న వ్యాక్సిన్లే సరిపోతాయని భరోసా ఇచ్చారు.
ఒకవేళ బ్రిటన్ కు విమాన సర్వీసులను పునరుద్ధరించాలనుకుంటే అక్కడి నుంచి వచ్చి కొవిడ్ పాజిటివ్ గా తేలిన వారిలో కనీసం పది శాతం మందికైనా కొత్త వైరస్ కు సంబంధించిన జన్యు క్రమాలను గుర్తించాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఆరేడు ల్యాబుల్లో ఆ జన్యు క్రమాలను విశ్లేషిస్తున్నారని వివరించారు. సామూహిక రోగ నిరోధకశక్తిని గుర్తించేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ సీరో సర్వేలు చేసే విషయంపై కసరత్తులు చేస్తున్నామని ఆయన తెలిపారు.