Child Friendly Police Station: రంగురంగుల గోడలు.. వాటిపై డోరేమాన్, ఛోటా భీమ్ కార్టూన్లు.. పిల్లల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్!
- డెహ్రాడూన్ లో మొట్టమొదటి బాల మిత్ర ఠాణా
- చిన్నారులు భయపడకుండా ఉండేందుకు ఏర్పాటు
- సివిల్ డ్రెస్సుల్లోనే పోలీసుల డ్యూటీలు.. ప్రత్యేక శిక్షణ
- సీఎంకు కొవిడ్ సోకడంతో ప్రారంభోత్సవం వాయిదా
లాకప్ లో ఖైదీలు.. ఓ పక్కన తుపాకులు.. గోడ మీద బేడీలు.. ఖాకీ యూనిఫాం వేసుకుని గంభీరంగా ఉండే పోలీసులు.. ఇదీ పోలీస్ స్టేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది. కానీ, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఉన్న దళన్ వాలాకు పోతే.. అవేవీ కనిపించవు.
గోడల మీద డోరేమాన్, ఛోటా భీమ్ కార్టూన్లు వెల్ కమ్ చెబుతాయి. రంగు రంగుల గోడలు ఆహ్లాదాన్ని పంచుతాయి. వాటికి తోడు అక్కడ ఏ పోలీసూ ఖాకీ డ్రెస్ ధరించరు. ఇన్ని ప్రత్యేకతలతో ఏర్పాటు చేసిన ఆ పోలీస్ స్టేషన్ పెద్దలకు మాత్రం కాదండోయ్.. పిల్లల కోసం పెట్టిన ‘బాలమిత్ర ఠాణా’ అది.
దళన్ వాలా పోలీస్ స్టేషన్ లోని మొదటి అంతస్తులోనే దీనిని ఏర్పాటు చేశారు. అయితే, పెద్ద వాళ్ల పోలీస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేకుండా అక్కడికి వెళ్లేందుకు బయటి నుంచే ప్రత్యేకంగా మెట్లనూ ఏర్పాటు చేశారు.
పోలీస్ స్టేషన్ అంటేనే పెద్దలకు ఎక్కడలేని భయం. అలాంటిది పిల్లలకు ఇంకెంత భయం ఉండాలి! ఆ భయాన్ని పోగొట్టి స్నేహపూర్వకంగా వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిందే ఈ పోలీస్ స్టేషన్. చిల్లర నేరాలకు పాల్పడే చిన్నారులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు, అఘాయిత్యాలకు గురైన బాధిత బాలలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి గోడు చెప్పుకుని ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఠాణాను ఇలా మార్చారు.
ఉత్తరాఖండ్ బాలల హక్కుల రక్షణ కమిషన్ (యూసీఆర్ పీసీ) ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. అయితే, గురువారమే సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. ఈ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించాల్సి ఉన్నా కొవిడ్ సోకి ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోలుకున్నాక ప్రారంభించేందుకు మరో తేదీ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పిల్లలకు స్నేహపూర్వక వాతావరణంలో కౌన్సిలింగ్ ఇచ్చేలా పోలీసు సిబ్బందికి త్వరలోనే శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని యూసీఆర్ పీసీ చైర్ పర్సన్ ఉషా నేగి చెప్పారు. పోలీసులను చూసి చిన్నారులు భయపడకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేశామన్నారు. పోలీసులు సివిల్ డ్రెస్ లోనే ఉండి పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తారని, అక్కడే వారికి పునరావాసమూ కల్పిస్తామని వివరించారు.
పిల్లల పోలీస్ స్టేషన్ లో పనిచేసేందుకు ప్రత్యేకంగా ఓ టీమ్ ను నియమిస్తామని డెహ్రాడూన్ ఎస్పీ, బాలమిత్ర ఠాణా నోడల్ అధికారి శ్వేత చౌబే తెలిపారు. వేరే పోలీస్ స్టేషన్లలో బాల మిత్ర ఠాణాలు ఏర్పాటయ్యేంత వరకు.. వేరే ప్రాంతాల్లోని చిన్నారులనూ దళన్ వాలాకే తరలిస్తామని చెప్పారు.