Narendra Modi: రైతుల ఆందోళనపై స్పందిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మోదీ విమర్శలు

  • ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథక నిధులు విడుదల 
  • కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తున్నారు
  • నిరసనలు రాజకీయ ప్రేరేపితమే
  • ఎన్నో అపోహలను ప్రచారం చేస్తున్నారు
  • మమతా బెనర్జీ బెంగాల్‌ను నాశనం చేస్తున్నారు
modi slams congress tmc

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి తుది విడత నిధుల పంపిణీని ప్రధాని మోదీ ఈ రోజు విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి.  9 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో అవి పడనున్నాయి.

వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఈ నిధులను విడుదల చేశారు. అన్నదాతల ఆదాయాన్ని పెంచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఆరు రాష్ట్రాల రైతులతో మోదీ వర్చువల్ పద్ధతిలో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆయన అవగాహన కల్పిస్తున్నారు.

కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తాము కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో జరుగుతోన్న కొన్ని నిరసనలు రాజకీయ ప్రేరేపితమేనని చెప్పుకొచ్చారు.

ఒప్పంద వ్యవసాయంపై దేశంలో ఎన్నో అపోహలను ప్రచారం చేస్తున్నారని, కొత్త సాగు చట్టాలపై వదంతులు వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది రాజకీయ నేతలు తమ స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటున్నారని, రైతులను మాత్రం పట్టించుకోవట్లేదని ప్రధాని చెప్పారు.

అమాయక రైతుల జీవితాలతో రాజకీయ నాయకులు చెలగాటం ఆడుతున్నారని, దేశంలో వారు రాజకీయ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారని చెప్పుకొచ్చారు. తాము తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై చేస్తోన్న నిరసనల వెనుక రాజకీయ అజెండా ఉందని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్లో 70 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ నిధులను అందుకోలేకపోతున్నారని, ఇందుకు అక్కడి రాజకీయాలే కారణమని చెప్పారు. ఆ రాష్ట్రం నుంచి చాలా మంది ఆన్‌లైన్ ద్వారా నేరుగా పీఎం కిసాన్ నిధి కోసం దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు. సొంత రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు చేరకుండా అడ్డుకుంటూ, పశ్చిమ బెంగాల్ ను సీఎం మమతా బెనర్జీ నాశనం చేస్తున్నారని మోదీ తీవ్రంగా మండిపడ్డారు.

More Telugu News