Farmers Protest: అన్ని విషయాలూ చర్చిద్దాం రండి.. ఆందోళన చేస్తున్న రైతులకు కేంద్రం మరో లేఖ
- మద్దతు ధరను చట్టాలతో లంకె పెట్టడం సహేతుకం కాదన్న వ్యవసాయ శాఖ
- అయినా వాటిపైనా చర్చించేందుకు సిద్ధమని వెల్లడి
- చట్టాల రద్దు అంశం పెడితే బాగుంటుందన్న రైతు సంఘం
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చట్టాల రద్దు, కనీస మద్దతు ధర వంటి అంశాలను చర్చల అజెండాలో చేరిస్తేనే ముందుకొస్తామన్న రైతులు.. నిన్నటి కేంద్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించారు. దీంతో గురువారం మరోసారి రైతులను బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఆందోళన చేస్తున్న 40 రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ లేఖ రాసింది. మునుపటి చర్చల్లో మాట్లాడిన అంశాలతో పాటు రైతులు ఇప్పుడు కావాలనుకుంటున్న అంశాలనూ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
వ్యవసాయ చట్టాలతో కనీస మద్దతు ధరకు ఎలాంటి సంబంధం లేదని, చర్చల్లో వాటిపై మాట్లాడాలనడంలో సహేతుకత లేనిదని కేంద్రం పేర్కొంది. అయినా కూడా వాటిపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. రైతులు లేవనెత్తుతున్న అన్ని విషయాలపైనా విపులంగా చర్చిస్తామని వెల్లడించింది. రైతులు ఎప్పుడంటే అప్పుడు చర్చలకు రావొచ్చని సూచించింది.
కేంద్రం లేఖపై జై కిసాన్ ఆందోళన్ జాతీయ కన్వీనర్, ఏఐకేఎస్ సీసీ ప్రధాన కార్యదర్శి అవిక్ సాహా స్పందించారు. కనీసం చర్చలు జరుగుతున్నప్పుడైనా చట్టాలను పక్కనపెడితే బాగుంటుందని అన్నారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందం లాంటిదేనన్నారు. చర్చల అజెండాలో చట్టాల రద్దు అంశం ఉంటే ఆ చర్చలు బాగా జరుగుతాయన్నారు.
కాగా, చర్చల విషయమై రైతులకు కేంద్రం లేఖ రాయడం ఇది మూడోసారి. చట్టాలను మరింత కట్టుదిట్టం చేసే సవరణలు చేస్తామని హామీ ఇస్తూ డిసెంబర్ 9న మొదటి లేఖ రాయగా.. ఆ సవరణలతో పాటు మరిన్ని అంశాలపైనా మాట్లాడుదామంటూ డిసెంబర్ 20న రెండో లేఖ రాసింది. రెండో లేఖకు బదులుగా.. ‘ప్రేమ లేఖలు రాయడం ఆపండి’ అంటూ రైతులు కౌంటర్ ఇచ్చారు. తాజాగా మూడో లేఖనూ కేంద్రం రైతులకు పంపింది.