Rahul Gandhi: ఆ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు రైతులు ఇంటికి వెళ్లరు: రాహుల్ గాంధీ

  • వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండుకోట్ల సంతకాల సేకరణ
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేత
  • దేశానికి అసమర్థుడు ప్రధాని అయ్యారంటూ మండిపాటు
Rahul Gandhi warns modi on farm laws

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రైతులు ఇంటికి వెళ్లబోరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నిన్న ఉదయం అందించారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ మోదీపై విరుచుకుపడ్డారు. దేశం అసమర్థుడి చేతిలో ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరుముగ్గురు ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చారని దునుమాడారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాలు రైతులకు పూర్తిగా వ్యతిరేకమైనవని పేర్కొన్న రాహుల్.. వెంటనే పార్లమెంటు సంయుక్త సమావేశాలు నిర్వహించి వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులు తీవ్ర కష్టంలో ఉన్నారని, ప్రతిపక్షలు వారివెంటే ఉన్నాయన్నారు. కరోనా వల్ల తీవ్ర నష్టం కలగబోతోందని ముందే హెచ్చరించినా ప్రధాని వినిపించుకోలేదన్నారు. ఇప్పుడు తనవారి కోసం డబ్బు సంపాదించిపెట్టే కార్యక్రమాన్ని మోదీ మొదలుపెట్టారని ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా నోరెత్తే రైతులు, కార్మికులపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News