Mahabubnagar dist: పీటలపై పెళ్లిని ఆపి, వధువును తీసుకెళ్లిన పోలీసులు.. పెళ్లికొచ్చిన అమ్మాయికి తాళికట్టిన వరుడు!

 police stopped the wedding and took the bride then  groom tied knot in another girl

  • మహబూబ్‌నగర్ జిల్లా మరిపెడలో ఘటన
  • ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ పోలీసులకు వధువు ఫోన్
  • నచ్చజెప్పినా వినకపోవడంతో సఖి కేంద్రానికి తరలింపు

తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తల్లిదండ్రులు తనకు పెళ్లి చేస్తున్నారని, దయచేసి పెళ్లి ఆపాలంటూ ఓ వధువు కల్యాణ మండపం నుంచే పోలీసులకు రహస్యంగా ఫోన్ చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు పెళ్లి మండపానికి చేరుకుని పెళ్లి ఆపివేయించారు. పీటలపై పెళ్లి ఆగిపోవడాన్ని అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు పెళ్లికొచ్చిన సమీప బంధువైన అమ్మాయితో అదే ముహూర్తానికి పెళ్లి జరిపించారు. మహబూబ్‌నగర్ జిల్లా మరిపెడలో జరిగిందీ ఘటన.

మండలంలోని గుండెపూడికి చెందిన యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం పెళ్లి తంతు ప్రారంభమైంది. మరికాసేపట్లో వధువు మెడలో వరుడు మూడుముళ్లు వేయాల్సిందే. అంతలోనే మండపంలోకి పోలీసులు ప్రవేశించడంతో అందరూ అవాక్కయ్యారు. తనకు ఈ వివాహం ఇష్టం లేదని, తానో యువకుడిని ప్రేమించానని, దయచేసి ఈ పెళ్లిని ఆపాలంటూ మండపం పైనుంచే రహస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో అక్కడికి చేరుకున్న మరిపెడ సీఐ, ఎస్సైలు వధువును సమీపించి విషయం ఆరా తీశారు. పెళ్లి చేసుకోవాలంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె ససేమిరా అనడంతో చేసేది లేక కౌన్సెలింగ్ కోసం సఖి కేంద్రానికి తరలించారు. తమ కుమార్తే పోలీసులకు ఫోన్ చేసిన విషయం తెలిసిన తల్లిదండ్రులు హతాశులయ్యారు. మరోవైపు, పీటల మీద పెళ్లి ఆగిపోవడాన్ని అవమానంగా భావించిన వరుడి తరపు కుటుంబ సభ్యులు పెళ్లికొచ్చిన బంధువుల అమ్మాయితో అదే ముహూర్తానికి వివాహం జరిపించారు.

  • Loading...

More Telugu News