Andhra Pradesh: స్నేహలత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం.. ఒకరికి ఉద్యోగం
- ఈ నెల 22న స్నేహలత హత్య
- చట్టపరంగా అందే దానికి ఈ పరిహారం అదనం
- 5 ఎకరాల భూమి, మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని ఆదేశించారు. కాగా, సీఎం ప్రకటించిన పరిహారం చట్టపరంగా బాధిత కుటుంబానికి అందాల్సిన సాయానికి ఇది అదనం. దళిత మహిళపై కనుక అత్యాచారం జరిగితే చట్టపరంగా రూ. 8.25 లక్షల పరిహారం లభిస్తుంది.
మరోవైపు, బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 4,12,500 మంజూరు అయింది. ఈ మేరకు మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అలాగే, ఇంటి స్థలంతోపాటు స్నేహలత కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల పొలం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వీటితోపాటు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, వంటపాత్రలు అందజేస్తామన్నారు.
భారతీయ స్టేట్‌బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేహలత ఈ నెల 22న సాయంత్రం విధులు ముగించుకుని వస్తున్న సమయంలో హత్యకు గురైంది. తర్వాతి రోజు ఉదయం ఊరి శివారులో ఆమె మృతదేహం కనిపించింది. రాజేశ్, కార్తీక్ అనే ఇద్దరు యువకులే ఆమెను హత్య చేశారని స్నేహలత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారిద్దరూ ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్నారని, వారే ఈ దారుణానికి తెగబడి ఉంటారన్నారు. ప్రేమను నిరాకరించిందన్న కోపంతోనే ఆమెను హత్య చేసి ఉంటారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.