Hyderabad: హైదరాబాదులో ఇళ్ల కొనుగోళ్లు 68 శాతం పెరిగాయి: జేఎల్ఎల్ కన్సల్టెన్సీ

  • లాక్ డౌన్ తర్వాత నాలుగో త్రైమాసికంలో జోరుగా కొనుగోళ్లు
  • దేశవ్యాప్తంగా 51 శాతం మేర పెరిగిన క్రయవిక్రయాలు
  • అక్టోబర్-డిసెంబర్ లో 21,832 యూనిట్ల అమ్మకం
  • అందులో 5,026 యూనిట్లతో ముంబై మొదటి స్థానం
  • హైదరాబాద్ లో అమ్ముడైన 3,570 యూనిట్లు
Home sales in Hyderabad Up by 68 percent

కొవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు అన్ని వ్యాపారాలు డీలా పడిపోయాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటున్నాయి. నిర్మాణ రంగంపై కరోనా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ వల్ల కలిగిన ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది ఇళ్లు కొనేందుకు ఆసక్తి చూపించలేదు.

అయితే, లాక్ డౌన్ ఎత్తేయడం, మళ్లీ కార్యకలాపాలు యథావిధిగా నడుస్తుండడంతో నిర్మాణ రంగానికీ జోష్ వచ్చింది. జులై-సెప్టెంబర్ మూడో త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ నాలుగో త్రైమాసికంలో ఇళ్ల కొనుగోళ్లు సగానికిపైగా పెరిగాయి. నిర్మాణ రంగానికి చెందిన జేఎల్ఎల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

మూడో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా కేవలం 14,415 యూనిట్లే అమ్ముడవగా.. నాలుగో త్రైమాసికంలో 51 శాతం మేర పెరిగి 21,832 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఢిల్లీ-ఎన్ సీఆర్, ముంబైల్లోనే అత్యధికంగా ఇళ్లు అమ్ముడైనట్టు ఆ సంస్థ వెల్లడించింది. మొత్తం ఇండ్ల కొనుగోళ్లలో 23 శాతం వాటాతో ముంబై మొదటి స్థానంలో నిలవగా.. 20 శాతంతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ వాటా 16.3 శాతంగా నమోదైంది. మొత్తంగా 3,570 ఇండ్లు అమ్ముడయ్యాయి.

మూడో త్రైమాసికంలో ముంబైలో 4,135 ఇండ్లే అమ్ముడవగా.. నాలుగో త్రైమాసికంలో 22 శాతం మేర పెరిగి 5,026 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఢిల్లీలో 43 శాతం వృద్ధి కనిపించింది. పోయిన త్రైమాసికంలో అమ్ముడైన 3,112 యూనిట్లతో పోలిస్తే ఇప్పుడు 4,440 యూనిట్లు అమ్ముడు పోయాయి.

వృద్ధి పరంగా చూస్తే మాత్రం పూణే మొదటి స్థానంలో నిలిచింది. నాలుగో త్రైమాసికంలో 3,323 యూనిట్లు అక్కడ అమ్ముడుపోయాయి. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది 147 శాతం అధికం. గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో పూణేలో ఇళ్ల సేల్స్ కేవలం 1.7 శాతమే పడిపోయాయి. 68 శాతం వృద్ధితో హైదరాబాద్ రెండో స్థానంలో నిలవగా.. 59 శాతం వృద్ధితో చెన్నై మూడో స్థానంలో ఉంది.

More Telugu News