KCR: ప్రసిద్ధ బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం
- ఏఐఎఫ్‌ఏసీఎస్ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకున్న యాసల
- అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించారన్న కేసీఆర్
- బాలయ్య మరణం చిత్ర కళారంగానికి తీరని లోటని వ్యాఖ్య
బాతిక్ పెయింటింగ్‌లో ఏఐఎఫ్‌ఏసీఎస్ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకున్న తెలంగాణ ముద్దుబిడ్డ యాసల బాలయ్య అనారోగ్యంతో బాధపడుతూ కన్ను మూశారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారని సీఎంవో తెలిపింది. ‘అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన బాతిక్ చిత్ర కళాకారుడు శ్రీ యాసల బాలయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు’ అని సీఎంవో పేర్కొంది.
‘శ్రీ బాలయ్య మరణం చిత్ర కళారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. బాతిక్ చిత్ర కళ ద్వారా బాలయ్య పల్లె జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు’ అని సీఎంవో పేర్కొంది.
ఆయన మృతి పట్ల హరీశ్ రావు కూడా స్పందిస్తూ సంతాపం తెలిపారు. సిద్ధిపేట బిడ్డగా సిద్ధిపేట కీర్తిని తన బాతిక్ చిత్ర కళ ద్వారా ఖండాంతరాలు దాటించిన గొప్ప కళాకారుడు బాలయ్య మరణం చాలా బాధాకరమని అన్నారు. బాతిక్ చిత్ర కారునిగా రాష్ట్రపతి అవార్డును కూడా బాలయ్య అందుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.