Andhra Pradesh: గౌతు లచ్చన్న విగ్రహం వద్ద నిరసనకు టీడీపీ పిలుపు.. శ్రీకాకుళంలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

police house arrest tdp leaders in srikakulam

  • సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామన్న మంత్రి
  • టీడీపీ శ్రేణుల నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు
  • అయినా, నిర్వహించి తీరుతామన్న టీడీపీ నేతలు

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడున్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ నేడు ఆ విగ్రహం వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. నిరసనకు పోలీసులు అభ్యంతరం తెలపడంపై మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషతోపాటు మరికొందరు నాయకులు గత అర్ధరాత్రి డీఎస్పీ శివరామిరెడ్డిని కలిసి చర్చించారు. అయినప్పటికీ అనుమతి ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.

నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ తాము కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గౌతు శిరీష తేల్చిచెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యక్రమానికి వెళ్లకుండా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధినేత అచ్చెన్నాయుడు, శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, నేతలు కూన రవికుమార్, సోంపేటలో గౌతు శ్యామసుందర శివాజీ, పలాస టీడీపీ కార్యాలయంలో గౌతు శిరీషలను పోలీసులు నిర్బంధించారు.

  • Loading...

More Telugu News