Odisha: తొమ్మిది నెలల తర్వాత తెరుచుకున్న పూరి జగన్నాథుడి ఆలయ ద్వారాలు.. 3 నుంచి భక్తులందరికీ అనుమతి!
- కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 20న ఆలయ ద్వారాల మూత
- స్వామి, అమ్మవార్ల దైనందిన సేవలకు మాత్రమే అనుమతి
- 1, 2 తేదీల్లో మళ్లీ మూత
కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20న మూతపడిన ఒడిశాలోని ప్రసిద్ధ పూరి దేవాలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. 9 నెలలపాటు మూతపడిన జగన్నాథుడి ఆలయ ద్వారాలను అధికారులు నిన్న తెరిచారు. ఈ నెల 26 నుంచి 31 వరకు స్థానిక భక్తులకు, జనవరి 3 నుంచి అన్ని ప్రాంతాల భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో జనవరి 1, 2 తేదీలలో ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆలయం లోపల జగన్నాథ, బలబద్ర, సుభద్రల దైనందిన సేవలకు మాత్రమే అధికారులు అనుమతించారు. అలాగే, ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రేపటి వరకు సేవాయత్‌ల కుటుంబాలకు మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.