Pawan Kalyan: రైతుల పరిహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించాలని పవన్ నిర్ణయం
- నివర్ తుపానుతో రైతన్నల విలవిల
- లక్షల ఎకరాల్లో పంట నష్టం
- రూ.35 వేల పరిహారం ఇవ్వాలంటున్న పవన్ కల్యాణ్
- తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్
- రాష్ట్రవ్యాప్తంగా జైకిసాన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం
ఇటీవల సంభవించిన నివర్ తుపాను ఏపీ రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వాలంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 28న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ను కలిసి వినతిపత్రం అందించనున్నారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు రూ.35 వేలు పరిహారంగా చెల్లించాలని, తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలని పవన్ కోరుతున్నారు.
ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి గుడివాడ, పెడన పట్టణాల మీదుగా మచిలీపట్నం చేరుకుని జిల్లా కలెక్టర్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేస్తారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా జనసేన తలపెడుతున్న జైకిసాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో జనసేన నేతలు నివర్ తుపాను బాధిత రైతుల తరఫున వినతి పత్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.