Mamata Banerjee: అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి... ధోక్లా అన్నా, గుజరాతీ వంటకాలన్నా నాకు చాలా ఇష్టం: మమతా బెనర్జీ
- కొన్నిరోజులుగా అమిత్ షా, మమత మాటల యుద్ధం
- తనపై ఆరోపణలు నిరూపించాలన్న మమత
- లేకపోతే గుజరాతీ వంటకాలు తినిపించాలని సవాల్
- హోంమంత్రిగా నిరాధార ఆరోపణలు చేయొద్దని హితవు
గత కొన్నిరోజులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మమతా బెనర్జీ స్పందిస్తూ అమిత్ షాకు సవాల్ విసిరారు. తనపై ఆయన చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని, ఒకవేళ నిరూపించలేకపోతే తనకు ట్రీట్ ఇవ్వాలని అన్నారు. తనకు ధోక్లా వంటకంతో పాటు ఇతర గుజరాతీ వంటకాలన్నా చాలా ఇష్టమని మమత చమత్కరించారు.
అమిత్ షా ఒక దేశానికి హోంమంత్రిగా వ్యవహరిస్తూ నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. హోంమంత్రిగా మాట్లాడేటప్పుడు ప్రతి అంశానికి గణాంకాలు, సమాచారం తప్పనిసరి అన్న విషయం ఆయన గుర్తెరగాలని దీదీ చురకలంటించారు.
టీఎంసీ హయాంలో బెంగాల్లో రాజకీయ హత్యలు, ఇతర నేరాలు గణనీయంగా తగ్గినట్టు ఎన్ సీఆర్ బీ వెల్లడించిన నివేదికలు చెబుతున్నాయని, అభివృద్ధి పరంగానూ బెంగాల్ ముందుందని, కానీ అమిత్ షా ఉద్దేశపూర్వకంగా పశ్చిమ బెంగాల్ ను హీన రాష్ట్రంగా పేర్కొంటున్నారని మమతా బెనర్జీ విమర్శించారు.