Khanapur: అటవీశాఖ కార్యాలయం, గెస్ట్ హౌస్ లను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు!
- ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో ఘటన
- పన్ను చెల్లించలేదని సీజ్ చేసిన అధికారులు
- పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్న అటవీ సిబ్బంది
ఒక ప్రభుత్వ శాఖపై మరో ప్రభుత్వ శాఖ చర్యలు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పన్నులు చెల్లించలేదంటూ అటవీశాఖ కార్యాలయాలను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఎఫ్డీఓ, ఎఫ్ఆర్వో కార్యాలయాలతో పాటు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ను కూడా సీజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ తోట గంగాధర్ ఆధ్వర్యంలో అధికారులు సీజ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే, ఈ కార్యాలయాలకు సంబంధించి అటవీశాఖ రూ. 1,93,161 పన్ను చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి అటవీ సిబ్బందికి పలుమార్లు నోటీసులు ఇవ్వగా ఇటీవలే రూ. 50 వేలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించాలని నోటీసులు ఇవ్వగా వారు స్పందించలేదు. దీంతో, కార్యాలయాలను సీజ్ చేశారు. దీంతో, కార్యాలయాల బయటే కూర్కొని సిబ్బంది పని చేశారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది మాట్లాడుతూ, ఇటీవలే రూ. 50 వేలు చెల్లించినప్పటికీ కార్యాలయాలను సీజ్ చేయడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు.