Super Hornet: స్కీ-జంప్ చేయగల ఇండియన్ నేవీ సూపర్ హార్నెట్ విమానాలు... ప్రదర్శించి చూపిన బోయింగ్!
- విజయవంతంగా గాల్లోకి ఎగిరిన ఎఫ్/ఏ-18 బ్లాక్ 3 సూపర్ హార్నెట్ లు
- మేరీల్యాండ్ లో జరిగిన పరీక్షలు
- త్వరలోనే భారత యుద్ధ నౌకలపైకి చేరనున్న విమానాలు
అతి త్వరలో భారత నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఎఫ్/ఏ-18 బ్లాక్ 3 సూపర్ హార్నెట్ విమానాలు 'స్కీ జంప్' కూడా చేయగలవు. ర్యాంప్ పై నుంచి ఈ విమానాలు విజయవంతంగా గాల్లోకి ఎగిరాయి. ఈ ఫీట్ ను బోయింగ్ సంస్థ చేసి చూపించింది. మేరీల్యాండ్ లో జరిగిన ఈ పరీక్షల్లో సూపర్ హార్నెట్ లు తక్కువ పొడవున్న ర్యాంప్ లపై వెళుతూ గాల్లోకి ఎగిరాయి. అంటే వీటిని భారత యుద్ధ నౌకలపై నుంచి దిగ్విజయంగా టేకాఫ్ చేయించవచ్చు.
ఇక, ఈ పరీక్షలపై భారత మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన బోయింగ్ డిఫెన్స్, స్పేస్ అండ్ సెక్యూరిటీ విభాగం హెడ్ అంకుర్ కంగలేకర్, "స్కీ-జంప్ ర్యాంప్ పై విజయవంతంగా యుద్ధ విమానాలు టేకాఫ్ చేశాయి. ఇక వీటిని ఇండియన్ నేవీ అధీనంలోని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పై నిలపవచ్చు" అని అన్నారు. పైలెట్ల భద్రతను అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని ఈ పరీక్షలు నిర్వహించామని, తొలి దశలో తేలికపాటి హార్నెట్ లను, ఆపై బలమైన ఆయుధాలతోనూ టేకాఫ్ లను చేయించి సక్సెస్ అయ్యామని అన్నారు.
ఇక ఈ ఫీట్ లో భాగంగా అతి తక్కువ పొడవుతో ఆకాశం వైపునకు ఏటవాలుగా వంగివుండే రన్ వేను ఏర్పాటు చేసి, వాటిపై నుంచి విమానాలను టేకాఫ్ చేయిస్తారు. ఈ పరీక్షల్లో విజయవంతమైన యుద్ధ విమానాలను మాత్రమే వార్ షిప్ లపై నిలిపేందుకు అనుమతి ఉంటుంది. ఈ సూపర్ హార్నెట్ విమానాలు కావాలని భారత నేవీ గతంలోనే బోయింగ్ తో డీల్ కుదుర్చుకుంది.
ఈ విమానాలు 10 వేల గంటల పాటు ఎగిరేంతటి జీవితకాలాన్ని కలిగివుంటాయని, అత్యాధునిక కాక్ పిట్ వ్యవస్థతో పాటు అణ్వాయుధాలను మోసుకుని వెళ్లి, జారవిడిచి, అవి చేరాల్సిన లక్ష్యాలను చేరాయా? అన్న విషయాన్ని నిర్దారించే రాడార్లను కలిగివుంటాయని బోయింగ్ అధికారులు తెలిపారు. ఈ తరహా విమానాలను అందించేందుకు ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ కూడా పోటీలో నిలిచినా, కాంట్రాక్టు బోయింగ్ కు చేరింది. ఇక ఈ విమానాలు ఇండియాకు చేరితే తొలుత ఐఎన్ఎస్ విక్రమాదిత్యపైనా, ఆపై త్వరలో జాతికి అంకితంకానున్న ఐఎన్ఎస్ విక్రాంత్ లపై నిలిపి ఉంచుతారు.