Narendra Modi: ప్రధాని మోదీకి ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్!
- నెల రోజుల్లో యూఎస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న ట్రంప్
- 'లీజియన్ ఆఫ్ మెరిట్' అవార్డుకు నరేంద్ర మోదీ ఎంపిక
- మోదీ తరఫున అవార్డును స్వీకరించిన ఎంబసీ అధికారి తరణ్ జిత్ సింగ్
మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న డొనాల్డ్ ట్రంప్, ప్రతిష్ఠాత్మక 'లీజియన్ ఆఫ్ మెరిట్' అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకటించారు. ఇండియా గ్లోబల్ పవర్ గా ఎదుగుతోందని, అమెరికాతో ఆ దేశానికి వ్యూహాత్మక భాగస్వామ్యం మోదీ నేతృత్వంలో ఎంతో బలపడిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నరేంద్ర మోదీ తరఫున యూఎస్ లో భారత దౌత్యాధికారి తరణ్ జిత్ సింగ్ సంధు అవార్డును స్వీకరించారు.
ఈ అవార్డును ప్రభుత్వ అధినేతలకు మాత్రమే ఇస్తామని ఈ సందర్భంగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. యూఎస్ - ఇండియా సంబంధాలు మరింతగా బలపడటం వెనుక నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు ప్రపంచం ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకరిస్తున్నాయని తెలిపారు.
కాగా, నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు కూడా లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డులను డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారని, వైట్ హౌస్ లోనే ఆయా దేశాల ప్రతినిధులు అవార్డులను స్వీకరించారని ఓ బ్రెయిన్ మరో ట్వీట్ లో తెలిపారు.
కాగా, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే పలు దేశాలు ఎన్నో అవార్డులను అందించాయి. 2016లో సౌదీ అరేబియా ప్రభుత్వం 'ఆర్డర్ ఆఫ్ అబ్దుల్లాజీజ్ అల్ సౌద్', 'స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్' అవార్డులను ప్రకటించగా, 2019లో రష్యా ప్రభుత్వం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్'ను, యూఏఈ 'ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు'ను అందించాయి. 2019లోనే మాల్దీవుల ప్రభుత్వం 'ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజాజుద్దీన్' అవార్డును ప్రకటించింది.