R.Narayana Murthy: ఎంజీఆర్ కు ఇస్తారు కానీ, ఎన్టీఆర్ కు ఎందుకివ్వరు?: 'భారతరత్న'పై ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు

Film maker R Narayana Murthy comments
  • ఓ మీడియా చానల్ కు నారాయణమూర్తి ఇంటర్వ్యూ
  • దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తారని వెల్లడి
  • మొదటి నుంచి వివక్ష ఉందని వ్యాఖ్యలు
  • వివక్ష పోవాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాలని స్పష్టీకరణ
  • కేసీఆర్ నాయకత్వంలో పార్టీలు ఏకం కావాలని పిలుపు
సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు తీసే అభ్యుదయవాది, నటుడు ఆర్.నారాయణమూర్తి ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. దక్షిణాది వాళ్లంటే మొదటి నుంచి వివక్ష ఉందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూడడం ఇప్పటిది కాదని అన్నారు. అయితే ఎంజీఆర్ కు భారతరత్న ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ కు ఎందుకివ్వరని నారాయణమూర్తి ప్రశ్నించారు. పండిట్ భీమ్ సేన్ కు అవార్డు ఇస్తారు కానీ, మన మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఎందుకివ్వరని నిలదీశారు.

ఇలాంటి వివక్ష పూరిత వైఖరి పోవాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇక, తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడుతుండడంపై స్పందిస్తూ, ఆయన రాజకీయాల్లోకి రావడం మంచిదేనని అన్నారు. ఈసారి మాత్రం రజనీ వెనుకంజ వేయకూడదని పేర్కొన్నారు.

ఏపీలో జగన్ పాలన బాగుందన్న నారాయణమూర్తి, తాను మాత్రం రాజకీయాల్లోకి రాబోనని వెల్లడించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో నిరసనలు జరుగుతుండడం పట్ల వ్యాఖ్యానిస్తూ, కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శించారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించి వ్యవసాయ చట్టాల అమలుపై నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని హితవు పలికారు.
R.Narayana Murthy
Bharata Ratna
MGR
NTR
KCR

More Telugu News