Team India: ఆసీస్ చేతిలో ఘోర పరాభవం.. రవిశాస్త్రిని తక్షణం తొలగించాంటూ ‘దాదా’కు విన్నపాలు!
- ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన భారత్
- రవిశాస్త్రే కారణమంటూ విరుచుకుపడుతున్న నెటిజన్లు
- ద్రవిడ్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్ టెస్టులో భారత జట్టు దారుణ ఓటమిని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌ను గంటలోనే ముగించిన కోహ్లీ సేన 36 పరుగులకు ఆలౌట్ కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్టు ఆటతీరు ఇదేనా? అంటూ మండిపడుతున్నారు. దీనంతటికి హెడ్ కోచ్ రవిశాస్త్రే కారణమని, వెంటనే ఆయనను తొలగించి రాహుల్ ద్రవిడ్, లేదంటే అలాంటి వారికి బాధ్యతలు అప్పగించాలంటూ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీని కోరుతున్నారు. మీమ్స్‌తో రవిశాస్త్రిపై విరుచుకుపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన భారత బ్యాట్స్‌మన్ రెండో ఇన్సింగ్స్‌లో అప్పుడే బ్యాట్ పట్టిన వారిలా ఆడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు కావడం గమనార్హం. భారత జట్టు ఆటతీరుపై సగటు అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ అయితే మరో అడుగు ముందుకు వేసి ఈ ఓటమిని మర్చిపోయేందుకు ఓటీపీ ఇదేనంటూ ఆటగాళ్లు చేసిన వ్యక్తిగత స్కోరును నంబరుగా పేర్కొన్నాడు.