Harish Rao: దయనీయ స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లకు పెద్ద దిక్కుగా నిలిచిన మంత్రి హరీశ్ రావు
- ఇటీవల భారీ వర్షాలు.. కూలిన ఇల్లు
- రామంచ గ్రామంలో నిరాశ్రయులుగా మారిన బాలమణి, స్రవంతి
- ఆదుకున్న హరీశ్ రావు
- కొత్త ఇల్లు కట్టించిన వైనం
సిద్ధిపేట జిల్లా రామంచ గ్రామానికి చెందిన బాలమణి, స్రవంతిలది ఓ దయనీయ గాథ. బాలమణి భర్త రాజయ్య ఎనిమిదేళ్ల కిందట గుండెపోటుతో మరణించాడు. దాంతో బాలమణి కుమార్తె స్రవంతితో కలిసి జీవిస్తోంది. ఆర్థిక స్థితి అంతంతమాత్రమే కావడంతో కుటుంబ పోషణ కోసం స్రవంతి పశువుల కాపరిగా వ్యవహరిస్తోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇల్లు కూలిపోయింది. దాంతో ఆ తల్లీకూతుళ్లు నిరాశ్రయులుగా మిగిలారు.
వీరి పరిస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెంటనే స్పందించారు. కూలిన ఇంటి స్థానంలో కొత్త ఇల్లు కట్టించారు. ఎవరి అండ లేని ఆ అభాగ్యులకు అన్నీ తానై నిలిచారు. కాగా, ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ఇవాళ గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్ రావు తల్లీకూతుళ్లకు కొత్త దుస్తులు కానుకగా ఇవ్వడమే కాకుండా, వారికి మిఠాయిలు కూడా అందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.