Vidya Nirvana: ఆరేళ్ల వయసుకే అరుదైన రికార్డు సాధించిన మంచు లక్ష్మి కుమార్తె
- 'యంగెస్ట్ చెస్ ట్రైనర్' గా విద్యా నిర్వాణ ఘనత
- నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
- నోబెల్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఇవాళ పరీక్ష
- ప్రజ్ఞ చాటిన చిన్నారి
- హర్షం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి, మోహన్ బాబు
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ చిన్న వయసులోనే ఘనతర రికార్డును సొంతం చేసుకుంది. ఆరేళ్ల వయసుకే నోబెల్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. విద్యా నిర్వాణ 'యంగెస్ట్ చెస్ ట్రైనర్' గా రికార్డు నెలకొల్పింది. ఇవాళ నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ చొక్కలింగం బాలాజీ సమక్షంలో చెస్ పరీక్షలో ఈ మంచు వారి అమ్మాయి అదరగొట్టింది. వయసుకు మించిన ప్రతిభతో చదరంగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించి అరుదైన రికార్డును కైవసం చేసుకుంది.
కాగా, పుత్రికోత్సాహంతో మంచు లక్ష్మి ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. చెస్ ను ఓ గేమ్ లా చూడడంలేదని, ఓ లైఫ్ స్కిల్ అని భావిస్తానని తెలిపారు. విద్యకు చిన్న వయసు నుంచే చదరంగంలో శిక్షణ ఇప్పించామని, ఇప్పుడు తాను అందులో ఎంతో నిష్ణాతురాలు కావడం హర్షణీయం అని పేర్కొన్నారు.
అటు, తన మనవరాలి ఖ్యాతి మార్మోగుతుండడంపై సీనియర్ నటుడు మోహన్ బాబు స్పందించారు. తనకు చెస్ గురించి పెద్దగా తెలియదని, కానీ తన మనవరాలు విద్యా నిర్వాణ చెస్ లో ప్రతిభ కనబరుస్తుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. విద్యా నిర్వాణ చదరంగంలో శిక్షణ పొందుతోంది అని లక్ష్మి చెప్పగానే, ఎందుకివన్నీ, చక్కగా చదువుకోవచ్చు కదా అనిపించిందని, కానీ ఆ చిన్నారి ఎంతో నైపుణ్యం చూపిస్తోందని లక్ష్మి చెప్పిందని మోహన్ బాబు వివరించారు.