Narendra Modi: మోదీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టిన ప్రబుద్ధులు.. అరెస్ట్!

  • వారణాసిలోని ఓ విల్లాలో మోదీ కార్యాలయం
  • రూ. 7.5 కోట్లకు అమ్ముతున్నట్టు ఓఎల్ఎక్స్ లో ప్రకటన
  • ఫిర్యాదును చూసి ఉలిక్కిపడ్డ పోలీసులు
PM Modis office is for sale in OLX

ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. వారణాసిలోని ఓ విల్లాలో మోదీ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయాన్ని నలుగురు ప్రబుద్ధులు ఓఎల్ఎక్స్ లో ఏకంగా అమ్మకానికి పెట్టేశారు. 6,500 చదరపు అడుగులు గల ఈ విల్లాలో 4 గదులు, 4 బాత్రూములు ఉన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈశాన్య ముఖద్వారంతో విల్లా ఉందని, కారు పార్కింగ్ ఉందని తెలిపారు. ఈ విల్లాను రూ. 7.5 కోట్లకు అమ్ముతున్నట్టు పేర్కొన్నారు.

దీనికి సంబంధించి ఫిర్యాదు అందడంతో స్థానిక పోలీసులు ఉలిక్కిపడ్డారు. ప్రధాని ఆఫీసును అమ్ముతున్నట్టు ఓఎల్ఎక్స్ లో ప్రకటన వచ్చిందని ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు... ఓఎల్ఎక్స్ లో ప్రకటనను తొలగింపజేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. దీనికి బాధ్యులైన నలుగురిని గుర్తించి, అరెస్ట్ చేశారు.

దీనిపై పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ, లక్ష్మీకాంత్ ఓఝా అనే వ్యక్తి ఈ ప్రకటనను ఇచ్చాడని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రకటన కోసం విల్లాను ఫొటో తీసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు.

More Telugu News