Jagan: గతంలో టీడీపీ జెండాను మోసేవారికే మేలు జరిగేది: 'బీసీ సంక్రాంతి' సభలో సీఎం జగన్

jagan slams chandrababu

  • కార్పొరేషన్ చైర్మన్లు తమ సామాజిక వర్గానికి, ప్రభుత్వానికి అనుసంధానకర్తలు
  • గతంలో చాలా గ్రామాల్లో ప్రజలకు అన్యాయం 
  • కనీసం ఇద్దరు, ముగ్గురికి కూడా కార్పొరేషన్ల ద్వారా మేలు జరగలేదు
  • కార్పొరేషన్ల వ్యవస్థను అంతగా దిగజార్చారు

గత టీడీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానంలో జరిగిన బీసీ సంక్రాంతి సభలో ఆయన పాల్గొని, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ... కార్పొరేషన్ చైర్మన్లు తమ సామాజిక వర్గానికి, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉండాలని ఆయన చెప్పారు.

‘చాలా గ్రామాల్లో చూశాం.. ఆయా గ్రామాల్లో వెయ్యి మంది పై చిలుకు జనాభా ఉంటే కనీసం ఇద్దరు, ముగ్గురికి కూడా కార్పొరేషన్ల ద్వారా గత ప్రభుత్వ హయాంలో మేలు జరగలేదు. అదికూడా అధికార పార్టీకి చెందిన వారికి, జన్మభూమి కమిటీ సభ్యులకు, టీడీపీ జెండాను తాము మోశామని సర్టిఫికెట్ చూపిస్తే తప్ప కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగేది కాదు’ అని జగన్ వ్యాఖ్యానించారు.

‘కార్పొరేషన్ల వ్యవస్థను అంతగా దిగజార్చారు. ఈ ఘటనలను నేను కళ్లారా చూశాను. ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో పూర్తిగా మార్పులు రావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేకుండా, లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికీ కార్పొరేషన్ల ద్వారా మేలు జరగాలి. అందుకే సంపూర్ణంగా మార్పులు తీసుకొస్తున్నాం’ అని జగన్ చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని తెలిపారు.

బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల ఎంపికలో మహిళలకు పెద్దపీట వేశామని జగన్ చెప్పారు. ఇంత మంది బీసీలకు అధికారమివ్వడం చరిత్రలోనే ఇది మొదటి సారని అన్నారు. బీసీలు అంటే వెనుకబడిన తరగతులకు చెందిన వారు కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలకు వారధులని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ తాము సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.

తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను నెరవేర్చుతున్నామని అన్నారు. తాము మంత్రి వర్గంలో 60 శాతం పదవులను బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకే కేటాయించామని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని తెలిపారు.

నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్టీ, ఎస్సీలకే కేటాయించాలని చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించామని తెలిపారు. అలాగే, గ్రామ వాలంటీర్లకు సెల్యూట్ చేస్తున్నానని, ఎక్కడా స్వార్థం, కుల, మత, రాజకీయాలు చూడకుండా సేవలు అందిస్తున్నారని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తున్నారని ప్రశంసించారు.

  • Loading...

More Telugu News